మానవ జన్మ - ఆదర్శం
మానవజన్మ అన్ని జన్మలకన్నా ఉత్తమమైనది. మానవుడు తన ఉనికిని తెలుసుకొని మసలుకోవాలి. స్వార్థం విడనాడాలి. నేను, నా కుటుంబం, నావాళ్లు అనుకోవడంతోబాటు అందరూ నావాళ్లు అనుకోవడంలో ఎంతో పరమార్థం దాగి వుంది. నా స్వార్థం అని అనుకునేవారిని ఎవ్వరూ తలవరు. నా మనిషి నా సంఘం, నా వాళ్ళు అనుకునేవారికి సమాజం ప్రతినిత్యం స్వాగతం పలుకుతుంది. మనిషి తోటి మనిషికి కాస్త సాయపడాలి. చేతనైన సాయం చేయాలి. ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి. మనిషి నైతిక ధర్మం పాటించాలి. ప్రకృతి ధర్మం పరమార్థం గ్రహించాలి. ఈ లోకం ఒక మాయా ప్రపంచం. అంతా మాయ. జగమే మాయ బ్రతుకే మాయ అన్న విధంగా మారిన ఈ రోజుల్లో శాశ్వతం కాదు ఈ దేహం. దీనిపై వ్యామోహం పెంచుకోకు.
సేవాభావంపై ఆసక్తి పెంచుకో. సేవాభావం అంటే సామాజిక సేవ. ఈ సేవల ద్వారా మనకు సంతృప్తి లభిస్తుంది. మనం ఎంతో సంపాదిస్తుంటాం. వృధాగా అనవసరంగా ఎన్నో ఖర్చులు చేస్తుంటాం. కానీ దానిలో కొంత ధనం సమాజ సేవలకు మాత్రమే వినియోగించాలి. మన చుట్టుప్రక్కల అనాథ ఆశ్రమం లేక వృద్ధాశ్రమాలు వుంటాయి. అక్కడికి వెళ్లి వారికి కొంత సాయపడవచ్చును. అది మానవతా ధర్మం అనిపించుకుంటుంది. అనాథలు దిక్కులేనివారు ఎందరో వుంటారు. వారిని ఆదుకుని వారికి మేమున్నాం అని భరోసా ఇవ్వాలి. అదే మానవ ధర్మం అనిపించుకుంటుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలి. భిక్షగాళ్లు ఏదైనా అడిగినపుడు కసురుకోరాదు, విసుక్కోరాదు. వారికి చేతనైన సాయం చేయాలి. మానవ ధర్మం సనాతన ధర్మంతో ముడిపడి వుండగలగాలి. అప్పుడు సత్య సంథత, సమర్థవంతమైన పరిపూర్ణత మనకు లభిస్తాయి. మానవుడు గొప్ప విజ్ఞానవేత్త, మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే. అటువంటి మానవతావాదం మూర్త్భీవించాలి. పదిమందికీ ఆదర్శప్రాయుడై నిలవగలగాలి. తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పాలి. దానిని విద్యాదానం అంటారు. కొందరు నిరుపేదలు పైచదువులు చదవలేనివారు ఉంటారు. అలాంటివారికి కాస్త ప్రోత్సాహం అందించాలి. చేయూతనివ్వాలి. అలాంటివారికి తనకున్నదానిలో కాస్త సాయం చేయాలి. అదే గొప్ప మానవత కాగలదు. మానవుడు మానవత్వంతో మసలుకోవాలి. రాక్షసత్వం విడనాడాలి. ఇతరులపట్ల నోరు లేని జీవులపట్ల కాస్త దయార్ద్ర హృదయం కావాలి. ప్రేమతో అందరినీ పలుకరించాలి. ప్రేమస్వభావంతో చూసుకోవాలి. సత్యం, ధర్మం, శాంతం, ప్రేమ, ఈ సుగుణాలు అన్నీ మానవునిలో వుండాలి. సత్యం మన శాంతం, ధర్మం వలన సౌశీల్యం, సద్భావన, శాంతమువలన కీర్తి, సౌభాగ్యం మనకు లభిస్తాయి. ప్రేమవలన ఈ లోకంలో అన్నింటిని జయించగలం. ప్రేమతో మసలుకో. చిరునవ్వుతో అందరినీ ఆకర్షించగలగాలి. మంచిని పెంచాలి. మమత పంచాలి. స్వార్థం వీడాలి. నిస్వార్థంతో జీవించాలి. పరోపకారం ఇదం శరీరం అన్న పరమార్థాన్ని గ్రహించాలి. ఏది ఏమైనా మానవ జన్మ ఆదర్శంగా వుండాలి. ఈ లోకంలో ఎందరో మహానుభావులు అందరూ ఆదర్శంగా జీవించారు. మానవ ధర్మానికి వారు మహనీయతను చాటారు. బాపూజీ సత్యమే అహింస పరమ ధర్మమని చాటారు. అంటరానితనం మహాపాపమన్నారు. అలాంటి మహనీయుల మాటలు ముత్యాలమూటలు. గాంధీజీ అడుగుజాడలలో మనం పయనించాలి. పదిమందికీ చేయూతనివ్వాలి. మానవసేవయే మాధవసేవగా భావించాలి. మానవ జన్మ ఆదర్శంగా వుండేలా జీవించాలి.